జగన్ ప్రభుత్వ రాక్షసత్వం 3 నెలల ఉద్యమం – 3 వేల కేసులు

అమరావతిని రాజధానిగా  కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన మొదలు పెట్టి ఇప్పటికి మూడు నెలలయింది. 29 గ్రామాల్లో మూడు వేల మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద 92 కేసులు పెట్టారు. ఒక్కో రైతుపై మూడు, నాలుగు కేసులు కూడా పెట్టారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. విచారణ పేరుతో రాత్రిళ్లు ఇళ్లకు వెళ్లి మహిళలను ఇబ్బందులు పెడుతున్నారు.

ఉద్యమకారులపై కుట్ర కేసులు, హత్యాయత్నం కేసులు కూడా పెడుతున్నారు. కృష్ణాయపాలెంలో తహసీల్దార్ను అడ్డుకున్నారని 428 మందిపై కేసులు పెట్టారు. డ్రోన్ కెమెరాలతో ఓపెన్ టాప్ బాత్రూంలలో స్నానాలు చేసేవారిని ఫోటోలు తీశారని నిరసన తెలిపినందుకు 100 మందిపై కేసులు పెట్టారని రైతులు చెబుతున్నారు. పలు కేసులలో ప్రధాన నిందితుడిగా ఒకరి పేరు పెట్టి మరో 40 మందితో కలిసి చేశారని ఆధారరహితంగా కేసులు నమోదు చేస్తున్నారు. రాజధాని గ్రామాల నుంచి దుర్గగుడికి పాదయాత్రగా బయలుదేరిన మహిళలను అడ్డుకుని వందలమందిపై కేసులు పెట్టారని, ఆంధ్రప్రదేశ్ లో దేవుడి మొక్కులు తీర్చుకునేందుకు కూడా నోచుకోలేదా అని రైతు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బాపట్ల ఎంపిని అడ్డుకున్నవారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, కానీ మహిళలపై అతని అనుచరులు దాడి చేస్తే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. పోలీస్ అరాచకాలతో రాజధాని ప్రాంతం విలవిలలాడుతోంది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. రేపు మరో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు అరాచకాలు చేసిన అధికారులు ఫలితం అనుభవిస్తారు.

వ్యవసాయం చేసుకుంటూ, ప్రశాంతంగా బతుకుతున్న రైతు కుటుంబాలు ఇవ్వాళ కోర్టుల చుట్టూ తిరిగే దయనీయమైన పరిస్థితిని కల్పించాయి ఈ ప్రభుత్వాలు. తరతరాలుగా తమ జీవనాధారంగా వున్న భూమిని  ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇచ్చిన రైతులు నేడు దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కారు. మూడు నెలలుగా చిన్నా, పెద్దా, ఆడ, మగా అంతా నిద్రాహారాలు మానుకుని రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. కానీ దున్నపోతుపై వానపడిన చందంగా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనీసం చీమకుట్టినట్టయినా లేదు. గత మూడు నెలలుగా అనేకమంది రాజధాని ప్రాంత ప్రజలు జైళ్లలో మగ్గుతున్నారు. రాజధాని కోసం మేము భూములిస్తే, ఆ రాజధానిని తరలించి, మమ్మల్ని జైళ్లపాలు చేయడం ఎంతవరకు న్యాయమన్న వారి ప్రశ్నకు జవాబు చెప్పేవాడెవడూ లేకపోవడం విషాదకరం. ఈ ప్రభుత్వం దమననీతిని ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu