సిఎఎ వల్ల పౌరసత్వాలు రద్దు కావు

పౌరసత్వ సవరణ చట్టంపై గత కొంతకాలంగా కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీరి చర్యల మూలంగా దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో ఒకరకమైన అభద్రతా భావం ఏర్పడింది. అసలు ఈ చట్టం ఏమిటి? ఎందుకు తెచ్చారు అనే విషయాల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

పొరుగు దేశాల్లో మతపరమైన అణచివేత, వేధింపులకు గురై భారతదేశానికి శరణార్దులుగా వలస వచ్చిన వారిని ఆదుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రాణాలరచేత పట్టుకుని పిల్లాపాపలతో మన దేశానికొచ్చిన వారికి రక్షణ కల్పించి, చేయూత నివ్వడం మన సాంస్కృతిక, జాతీయ బాధ్యత. అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాము. దీని వల్ల ఏ భారతీయుడి పౌరసత్వమూ రద్దు కాదు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ లో మైనారిటీలుగా వున్న హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు ఆశ్రయం కల్పించడం వల్ల మన దేశానికి, దేశంలో వున్న పౌరులకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. మతప్రాతిపదికన విడిపోయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో  హిందువులు, సిక్కులు మైనారిటీలు. భారతదేశ విభజన సమయంలో వీరు అప్పటి నేతల హామీలను నమ్మి పాకిస్థాన్ లోనే వుండిపోయారు.

అయితే తరువాత కాలంలో వీరిపై వేధింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. అక్కడ ఒకప్పుడు 20 శాతంగా వున్న హిందువుల జనాభా ఇప్పుడు రెండు శాతానికి పడిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హిందువులు ఎక్కడికెళతారు? మన దేశం మినహా ఏ దేశం కూడా వారికి ఆశ్రయమివ్వదు. శరణార్ధులుగా వచ్చి, ఇక్కడ కష్టాలుపడుతున్నవారికి ఆశ్రయమిస్తే ఈ పార్టీలకు వచ్చిన నష్టం ఏమిటి? వీరి వల్ల దేశానికొచ్చిన ప్రమాదం ఏమిటి?

కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని సంఘాలు దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీళ్లు నిజమైన సెక్యులరిస్టులైతే ఆయా దేశాల్లో అణచివేతకు గురవుతున్నవారి  కోసం గళమెత్తాలి. పాకిస్థాన్ దాష్టీకాలపై వీరు నోరెత్తరు. అసలు వీరి ఆందోళనల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయి. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఆందోళనలు చేయడమే దీనికి నిదర్శనం. విపక్ష పాలిత రాష్ట్రాల్లో హింసాయుత ఆందోళనలు జరగడం లేదు.

పౌరసత్వ సవరణ చట్టం  ప్రకారం శరణార్ధులకు  పౌరసత్వం దక్కుతుంది, కానీ దేశంలో ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు. కానీ కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు దేశ  ప్రజల పౌరసత్వం రద్దవుతుందని దుష్ర్పచారం చేస్తున్నారు. అంతే కాదు.. జాతీయ జనగణనను కూడా వివాదాస్పదం చేస్తున్నారు. జనగణన జరగక పోతే అనేక విధాలుగా నష్టం జరుగుతుంది. ఆయా ప్రాంతాల జనాభాను బట్టి నిధుల విడుదల, పేదల కోసం వివిధ పథకాల రూపకల్పన జరుగుతుంది. సకాలంలో జనగణన జరగకపోతే వీటన్నింటికీ బ్రేక్ పడుతుంది. కాబట్టి విపక్షాల వాదనలు ఎండగట్టి, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. అందులో భాగంగానే భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu