బిజెపిని ఆదరిస్తున్నప్రజలు

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్రలో భాగంగా అక్టోబరు 15 నుంచి 17 వరకు కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహించాను. తొలిరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పర్యటించాను.

జగ్గయ్యపేటలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బహిరంగసభతో మొదలైంది. బహిరంగ సభకు దాదాపు పదిహేను వందల మంది హాజరయ్యారు. అనంతరం జగ్గయ్యపేట పట్టణంలో మార్కెట్ యార్డు రోడ్డు నుంచి నేషనల్ హైవే ను క్రాస్ చేస్తూ షేర్ మహ్మద్ పేట వరకు జరిగింది. అక్కడి నుంచి మంగొల్లు, దాచినేనిపాలెం, మక్కపేట మీదుగా సాగి పెనుగంచిప్రోలులో ముగిసింది. పెనుగంచిప్రోలులో బిజెపి కార్యకర్తలు సాదరస్వాగతం పలికి సభను విజయవంతం చేశారు. మొత్తం 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరిగింది.

రెండవ రోజు నందిగామ నియోజకవర్గంలో అనాసాగరం గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. అనాసాగరం నుంచి నందిగామ సెంటర్ వరకు పాదయాత్ర సాగింది. సెంటర్లో జరిగిన సభలో చౌదరిగారు ప్రసంగించిన అనంతరం పాదయాత్ర పున:ప్రారంభమైంది.  అంబారుపేట, ఐతవరం, కీసర మీదుగా కంచికచర్ల వరకు జరిగింది. కంచికచర్లలో భారీ ర్యాలీ జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు మూడువేల మందితో జరిగిన బహిరంగసభతో రెండవరోజు యాత్ర ముగిసింది. మొత్తం 18.5 కిలోమీటర్లు పాదయాత్ర జరిగింది.

మూడవరోజు నూజివీడు నియోజకవర్గంలో, ప్రధానంగా నూజివీడు పట్టణంలో పాదయాత్ర జరిగింది. యనమదల గ్రామం నుంచి ప్రారంభమై ఆర్డీవో కార్యాలయం మీదుగా ఎస్ కన్వెన్షన్ వరకు 10.5 కిలోమీటర్లు జరిగింది. నూజివీడులో తెలుగుదేశం నేత నూతక్కి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో 500కు పైగా కార్యకర్తలు బిజెపిలో చేరారు. పాదయాత్ర అనంతరం ఎస్ కన్వెన్షన్ లో జరిగిన సభతో మూడవరోజు యాత్ర ముగిసింది.

యాత్ర మొత్తమ్మీద బిజెపి వైపు ప్రజలు ఆసక్తిగా చూడడాన్ని గమనించాను. పాదయాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడినప్పుడు అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ పాత పథకాల రద్దు, రివర్సు టెండరింగ్ లాంటి చర్యలు, ఏకపక్ష ధోరణిని ప్రజలు అంగీకరించడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు బాబు పని కంటే ప్రచారం ఎక్కువ చేసుకోవడం, ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరించలేకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ను కాపాడగలదని తాము నమ్ముతున్నామని చెప్తున్నారు. మోడీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్టలు పెరిగాయని అందరూ ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. గాంధీగారి పేరు చెప్పుకొని అధికారం చెలాయించిన కాంగ్రెస్ ఆయన కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ఆయన పేరుతో పాదయాత్రలు చేస్తూ, ఆయన ఆశయాలను ప్రజలకు గుర్తు చేయడం సంతోషదాయకమని చాలా మంది పెద్దవారు నాతో అన్నారు.

ఇక కొన్ని స్థానిక సమస్యలను కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా నేను తిరిగిన ప్రాంతాల్లో జగ్గయ్యపేటలో మంచినీటి పథకం పెండింగ్ పనుల గురించి చెప్పారు. జాతీయ రహదారి పక్కనే వున్న ఇండస్ర్టియల్ ఎస్టేట్, ఆటోనగర్ లను అభివృద్ధి చేసి, పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గర్లో పెద్దాసుపత్రి లేకపోవడం వల్ల ప్రయాణికులు చనిపోతున్నారని, ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తాను.

రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో సుబాబుల్ ఎక్కువగా సాగు చేస్తారు. టన్నుకు 4వేల రూపాయలు చెల్లించాల్సి వుండగా, కంపెనీల వారు కేవలం 2వేల రూపాయలే ఇస్తున్నారని రైతులు చెప్తున్నారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. వత్సవాయి మండలం పోలంపల్లి దగ్గర మున్నేరు కాజ్ వే పూడిక తీయకపోవడం వల్ల వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో 20 వేల ఎకరాలకు సాగునీరందండం లేదని, తక్షణం పూడిక తీయించాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

ఇక ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల పశ్చిమ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది. పత్తి, మిరప లాంటి పంటలు ఎక్కువగా వేశారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులతో మాట్లాడితే ఈ ఏడాది గిట్టబాటు ధరలుంటే తమకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. ఈ నెల 20న రెండోవిడత యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించనున్నాను.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu