పాదయాత్రలో నా దృష్టికొచ్చిన అంశాలు

పాదయాత్రలో నేను పర్యటించిన ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితుల గురించి ముందుగా తెలియజేస్తాను. విభజన తరువాత ఎపికి ఒక సీనియర్ నేత సారధ్యం, కేంద్రం సహకారం అవసరమని భావించి ప్రజలు టిడిపి, బిజెపి కూటమికి పట్టం కట్టారు. కానీ ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు. సరికదా, ఎన్డీఎ నుంచి కూడా టిడిపి బయటకొచ్చింది. ఎపికి ఎంతో ముఖ్యమైన రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాల్లో చంద్రబాబు సాగదీత వైఖరి కారణంగా రాష్ట్రం ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతోంది. చంద్రబాబునాయుడుపై వ్యతిరేకతతో ప్రజలు వైసిపికి పట్టం కట్టారు. అయితే కేవలం అయిదు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పోకడలతో వ్యతిరేకత తెచ్చుకున్నారు. పోలవరం రీటెండర్లు, రాజధాని పనులు నిలిపివేత, ప్రభుత్వ చర్యల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కివెళ్లడం, వరద నీటి నిర్వహణలో విఫలమవడం వంటి విషయాలను ప్రజలు హర్షించడం లేదని నా పరిశీలనలో వెల్లడయింది. ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపిలపై వున్న వ్యతిరేకత జాతీయపార్టీ అయిన బిజెపికి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమస్యల విషయానికొస్తే ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ కృష్ణాలో ప్రజలు సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగర్ ఆయకట్టు జోన్ 2లో వుండడం వల్ల నీరు సరిగా అందడం లేదు. సాగునీరు లేకపోవడం వల్ల రైతులు వర్షాధారంగా పెద్ద ఎత్తున సుబాబుల్ సాగు చేస్తున్నారు. కానీ దీనికి రేటు లేకపోవడం, కొనుగోళ్లు సరిగా జరగకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. టన్నుకు కనీస ధర రూ.4,200 వుండగా, కేవలం రెండు వేలకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతాలైన గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలు సరైన రోడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. గుడివాడ పట్టణం అయితే ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు.

ప్రకాశం జిల్లా కూడా సాగర్ జోన్ 2లో వుండడం వల్ల నాలుగేళ్లుగా నీరందక ఇబ్బందిపడుతున్నారు. పశ్చిమ కృష్ణా లాగే ఇక్కడ కూడా సుబాబుల్ సాగు ఎక్కువ. దీన్ని కొనే నాధుడే లేడు. ఈ జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటుకు గత ప్రభుత్వం ఇండోనేషియా కంపెనీతో ఎంవోయు కుదుర్చుకుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక దీని జాడే లేదు. రామాయపట్నం పోర్టు ఈ జిల్లా ప్రజలకు సెంటిమెంటుగా మారింది. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలున్నా, చెరువులు పూర్తిగా నింపడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హంద్రీ నీవా కాలువలకు సకాలంలో నీటి విడుదల చేయకపోవడం, కాలువలను చెరువులకు అనుసంధానించడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో వున్నారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తిచేసి చిత్తూరు జిల్లాకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా టమోటా పంటకు గిట్టుబాటు ధరల్లేక ఒక్కోసారి పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని, టమోటా నిల్వ చేసుకునే సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, టమోటా ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యలన్నింటిపై అధ్యయనం చేసి, వీటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu